మనసుపై వాస్తు ప్రభావం
మనసుపై వాస్తు ప్రభావం ఉంటుందా..? వాస్తు మార్పు చేస్తే మన తల రాత మారుతుందా..? ఇటీవల చాలా మందిలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి వాస్తు పనిచేసేది ప్రధానంగా మనస్సు మీదనే. అందుకు తగ్గట్టుగానే మనం మన అనుకూలమైనవి మంచి అని అనుకూలం కానివి చెడు అని నిర్ధారించుకొంటున్నాం.
పూర్వగ్రంధాలలో వాస్తుదోషాల గురించి ఇప్పుడు పుస్తకాలలో దొరికేటంత వివరణ కాకుండా కేవలం కొన్ని పదాలుగా మాత్రమే వాడారు. వాస్తు దోషాల వలన దుష్ర్పవర్తన అగ్ని భయం, చోరభయం, అన్యోన్యత లోపం, శత్రుత్వం, అనారోగ్యం వంటి విషయాలతో వివరించారు. కాని ఆధునికులు ఇంకా లోతుకు వెళ్ళి దోషాల తీవ్రతను విశదీకరించడం ప్రారంభించారు. ఇది తప్పే. కారణం ఏమిటంటే.. దోషాల వివరణతో భయపడేవారు, ఇతరుల ఇళ్ళ దోషాలను చూసి అవగాహన లేని వాఖ్యలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. పూర్వం మహర్షులు దోషాన్ని సూక్ష్మంగా వివరించి వదిలేశారు. వాస్తు మనసుపై చేసే ప్రభావం, మానసిక మార్పు గురించి వారిలో అవగాహన ఎక్కువగానే వుండి వుండవచ్చు.
ఉదాహరణకు.. నైరుతి దోషాల వలన దుష్ర్పవర్తన, దురలవాట్లు కలుగుతాయనే వివరణ వుంది. ఇవి రెండు మానసిక సంబంధమైనవే. నైరుతి దోషాలు సరిచేసిన చోట దురలవాట్లు వదులుకొన్నవారు, కాలక్రమేణా దుర్మార్గాలు తగ్గించుకొన్నవారు వున్నారు. ఈ విషయాలు ఎక్కువగా ముఠా తగాదాలు గల వారి ఇళ్ళ మార్పులు గమనిస్తే తెలుస్తుంది. కాలానుగుణ పరిస్థతుల వలన ఫ్యాక్షన్ తగ్గిందిని భావించేవారు వున్నా గతంలో కక్షలే పరువు ప్రతిష్టాలుగా బ్రతికే నాయకులు రాజీలు చేసుకొని సుఖపడదాం అనే ధోరణీకి వాస్తును ఆశ్రయించిన తరువాత భావించడం కనిపిస్తొంది.
కొందరు అవగాహన లేని వాస్తును ఆశ్రయించి బలైనవారుకూడా లేకపోలేదు. కాని వాస్తు మార్పు పరిస్థితులను వెతుక్కొంటూ ఉండగా పరిస్థితులు కూడా అనుకూలంగా తయారవడం వాస్తులో రహస్యమే. మనం ఇప్పట్లో దీన్ని కనుగొనలేం. అలాగే తాగు బోతుతనం, వ్యభిచారం, శాడిజం ప్రవర్తనగల వారు కూడా డాక్టరు చెప్పడనో, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారనో వాస్తుమార్పు చేసిన తరువాత వారి ప్రవర్తనా స్థాయిలో మార్పు కనిపిస్తోంది.
పుట్టుకతోనే బుద్దులు వస్తాయా..? నిజానికి పుట్టుకతోనే అంటే తల్లి గర్భంలోనే కొన్ని గుణాలు రావడం అన్నది ఈ తరం శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు. తల్లి మానసిక పరిస్థితి గర్భస్థ శిశువుపై పని చేస్తుందని ప్రతి డాక్టర్ సలహా ఇస్తూ తల్లిని ప్రశాంతంగా ఉండమని సలహా ఇస్తుంటారు. ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉన్న తల్లికి పిచ్చి పిల్లలు పుట్టడం, పిచ్చిపట్టిన స్త్రీకి, వ్యభిచారిణికి కూడా మంచి సంతానం, మేధావులు జన్మించడం చూస్తూనే వున్నాం. ఇంత మాత్రానా డాక్టర్ల పరిశోధన, సలహాలు తప్పనిసరి కాదు. తల్లి గర్భస్థ శిశువుల మనస్సు ఏకకాలంలో లయం అయి స్పందించినప్పుడు లేదా తల్లి మనస్సు తీవ్రంగా స్పందించినప్పుడు ఆ ప్రకంపనలు గర్భస్థ శిశువుకు వెళతాయి.
ఉదాహరణకు టీవీలో ఒక పిచ్చి పట్టిన స్త్రీని నలుగురు దుండగులు దారుణంగా చెరచడం.. ఆ అమ్మాయికి గర్భం రావడం, ఆ తర్వాత గర్భంతో ఆ పిచ్చి అమ్మాయి అనేక బాధలు పడటం.. వంటి విషాదకరమైన సన్నివేశాల్ని ఎవరు చూసినా బాధగా ఉంటుంది. అదే సన్నివేశాన్ని గర్భం దాల్చిన స్త్రీ చేసి ఎక్కవగా స్పందించి పదేపదే గుర్తు చేసుకొంటే ఆ అలజడి ప్రభావం గర్భస్థ శిశువుకు కూడా చేరే అవకాశం ఉంటుంది. అలాగే మంచి సంఘటనలు, మంచి భావాలు కూడా ప్రభావం చూపుతాయి. శ్రీకృష్ణుడు సుభద్రకు పద్మవ్యూహం గురించి చెబుతూ ఉంటే ఆమె గర్భస్థ శిశువు అభిమన్యుడు విన్నాడంటే అదో కథలే అని వదిలేస్తాం. ఈనాడు మానసిక శాస్త్రవేత్తలు గర్భస్థ శిశువుపై ఇటువంటి ప్రభావాలు వుంటాయని నిర్ధారిస్తున్నారు.
పుట్టుకతో వచ్చిన బుద్ధి వాడు పుడకలతో ఇల్లు నిర్మించుకున్పప్పుడే మారేది అని కొంతవరకు భావించవచ్చు. పూర్వం గృహనిర్మాణం కోసం ఎక్కువగా కర్రలనే వాడేవారు. ఉత్తర వాయవ్య దోషాలతో ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కొన్న వారు కూడా ఆ దోషాలను సవరించుకున్న తరువాత సక్రమ మార్గంలోకి రావడం చాలా సందర్భాల్లో గమనించవచ్చు. ఇక్కడ సందర్భంలో ప్రేమ వ్యవహారాలు కేవలం మనస్సుకు సంబంధించినది. వాస్తు మార్పుతో బుద్ధి మారి సక్రమ మార్గంలోకి రావడం గమనించవచ్చు.
మరికొన్ని విషయాలు మానసిక పరిస్థితులకు భిన్నంగా వుంటాయి. ఎలాగంటే.. ఆగ్నేయం బావి అగ్నిభయం, చోరభయం అని శాస్త్రం చెబుతూ వుంది. ఇవి సంఘనలే గాని మానసిక ప్రభావాలు కావు. దొంగతనం అగ్ని ప్రమాదం, వాహన ప్రమాదాలు వంటి సంఘటనలను వాస్తుకు అష్టదిక్పాలకుల పంచభూత ప్రభావమేనని సరిపెట్టుకొంటున్నా అష్టదిక్పాలక కారకత్వ (గుణాలు, కారకాలు) ప్రభావం బాగా పని చేస్తాయని పూర్వగ్రంధ పరిచయాల వల్ల తెలుస్తోంది.
వాస్తును సరి చేస్తే ఎంత కాలంలో ఫలితం వస్తుందనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. దీనికి సూటిగా సమాధానం చెప్పాలంటే సమస్యకు పరిష్కారం ఏ రూపంలో వస్తుంది అనే దానికన్నా ముందుగా సమస్యను ఎదుర్కొనే వారి మనస్తత్వంలో మార్పు వస్తుంది. అది ప్రశాంతతకు దారి ఇస్తుంది. దీనికి ఓ ఉదాహరణ చెప్పాలంటే... చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలిపోయే అలవాటు ఉన్న కొడుకు కోసం తండ్రి, అతని కుటుంబం చాలా ఆందోళన చెందుతూ వుంటారు. వాస్తు మార్పు చేస్తే.. ఆ చెడు అలవాటు ఉన్న కొడుకు మంచిగా మారితే అదే పదివేలని భావిస్తారు. అదే కొడుకు ఇల్లు వదిలి వెళ్లి మంచి సినిమా యాక్టర్ అయ్యాడనుకోండి మహాదృష్టం అని భావిస్తారు. మానసిక బాధ తగ్గడం, మానసిక మార్పు వరకే వాస్తుకు సంబంధం. ఫలితంలో వాడు సినిమా యాక్టర్ అవుతాడో, ఇంటి పట్టునే పడి వుంటాడో అనేది వాడి ప్రాప్తం లేదా ఇతర వాస్తు అంశాల ప్రభావం అని భావించాల్సిందే.
పశ్చిమ వాయవ్యం పెంపు వలన జనంలో పేరు తెచ్చుకోవాలని, రాజకీయం చేయాలని, రచనలు చేయాలనే ఉబలాటం పెరుగుతుంది. ఇది మానసిక ప్రవర్తనే. ఈ లక్షణం వలన ఆ వ్యక్తి వార్డు మెంబర్ అవుతాడో లేక ప్రధాన మంత్రి అవుతాడో అనేది దైవానుగ్రహమే. చదువు డబ్బులేని వ్యక్తుల కూడా పశ్చిమ వాయవ్యం పెంపు వలన వాళ్ల మాటలను ఇతరులు పదే పదే వినాలనిపించే కళగా మాట్లాడగల నేర్పును సంపాదిస్తారు.
ఉత్తర వాయవ్యం పెరిగిన, వైరాగ్యంగా వుండి సన్యాసిగా జీవిస్తారని శాస్త్రం చెబుతుంది. మనం మంచి పేరున్న మఠాలు, ఆశ్రమాలు గమనిస్తే ఉత్తర వాయవ్యం పెంపు లేదా ఈశాన్య దోషాలు కనిపిస్తాయి. ఈ మధ్య వాస్తు ప్రచారంలో పడి ముఠాలు, ఆశ్రమాలకు కూడా వాస్తు ఆచరించడంలో వైరాగ్య గుణం పోయి సంపార గుణాలు పెరిగి చెడ్డ పేరు తెచ్చుకొంటున్నాయి. అంటే మసుస్సుపై ఎంతగా వాస్తు ప్రభావం చూపుతుందో అర్థమవుతుంది.
శాస్త్రం మనం ఊహించని ఫలితాలు ఇవ్వడంలో శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధించాల్సిందే. అలాగే మన మనసులో జరిగే ఆలోచనలపై వాస్తును ఏ విధంగా అన్వయించుకోవాలన్నది మన విచక్షణతో గ్రహించాలి.