కనుబొమల మధ్య ఎర్రని బొట్టు పెట్టుకోవడం మన సంప్రదాయం. ఇది నిత్య సాధనాచైతన్యంగా చెప్పుకోవచ్చు. ఇంటికి వచ్చిన ఏ ముత్తయిదువకైనా బొట్టు పెట్టి పంపడం ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. పాపిడ నడుమ ధరించే ఈ సిందూరం పెళ్లయిందని చప్పడానికి ప్రధాన సూచిక. మేష భగవానుడు అంగారకుడు. అతని రంగు ఎరుపు. ఇది చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అందువల్లనే ఎర్రని సిందూరాన్ని నుదుటిపైన, పాపిట మధ్యలో ధరిస్తారు. ఈ రెండూ సౌభాగ్య చిహ్నాలే. పార్వతి, సతీల స్త్రీ శక్తి చిహ్నంగా కూడా సిందూరాన్ని పరిగణిస్తారు.
నుదుట బొట్టు పెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది. పసుపు మానవ శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని ఇనుమడింప జేస్తుంది. కురుపులను, గాయాలను మాన్పుతుంది. కుష్ఠు వ్యాధిని కూడా నియంత్రించే, రూపుమాపే శక్తి పసుపుకు ఉంది.
విష్ణు భక్తులు 'U' ఆకృతిలో తిలకం పెట్టుకుంటే, శైవ భక్తులు మూడు అడ్డగీతలతో దిద్దుకుంటారు. బొట్టు పెట్టుకునే చోట అగ్యచక్ర లేదా ఆధ్యాత్మిక లేదా మూడో నేత్రం ఉంటుందని చెపుతారు. ఇది ప్రధాన నాడీ కేంద్రం. అనుభవాలన్నీ కలగలిపి ఒకేచోట కేంద్రీకరించే బిందువు ఇది.
ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా దురదృష్టం, దుష్ట శక్తులు దరిచేరకుండా రక్షిస్తుందని విశ్వాసం.
కుంకుమ ధారణ - ఫలితాలు
మానవ శరీరంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల్లో మిగిలిన అవయవాలకు ఒక్కొక్క అధి దేవత ఉన్నారు. వారిలో లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుంచి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా, కనీసం బొట్టు అయినా పెట్టుకోవాలి. అప్పుడు దేవుని పూజించినట్లే అవుతుందని చెప్పవచ్చు.
చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో నిగూఢార్థముంది. మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు. మన నొసటిపై పెట్టుకున్న కుంకుమ బొట్టుపైన సూర్యకాంతి ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుంచే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానం కనుబొమల మధ్య నుంచే ఆజ్ఞాచక్రం. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుంది. మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రం.
నుదుట కుంకుమ నరదృష్టి దోషాన్ని నివారించే ప్రక్రియలో భాగస్వామి అవుతుందన్నది మరో కోణం. నాగరికత పరిణామం చెందుతున్న తరుణంలో స్త్రీలు ఎర్రని కుంకుమ ధరించడం సాంప్రదాయమైనప్పటికీ, ధరించిన వస్త్రాలకు అనుగుణంగా వివిధ వర్ణాల కుంకుమ ధరిస్తున్నారు. రక్త వర్ణంలోని బొట్టు, సాంప్రదాయం ప్రతిబింబించడంతో పాటు త్యాగగుణాన్ని ఆవిష్కరిస్తుంది. ఎర్రని కుంకుమ రక్తానికి సంకేతం. ఎర్రని కుంకుమతో అమ్మవారికి పూజ చేయడం, స్వీయ రుధిరంతో పూజించిన త్యాగఫలాన్ని అనువర్తింపజేస్తుందని ఓ అభిప్రాయం.
ధ్యాన యోగ నిష్ఠలో కుండలిని శక్తి జాగృతమవుతుందని, కుండలిని నుంచి వెలువడిన శక్తి తరంగాలు ఊర్థ్వముఖంగా పయనించి ఆజ్ఞాచక్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయనీ, కుంకుమ ధారణ వలన కుండలినీ శక్తి వృధాగా పోకుండా ఆత్మలబ్ధికోసం వితరణ అవుతుందని చెబుతారు. అంతే కాకుండా ధ్యాన మగ్నమై ఉన్న మనస్సు అచలితంగా నిలిచి ధ్యేయంపై కేంద్రీకృతమవుతుంది. ధ్యానంలో ఏకాగ్రత కుదిరినపుడు దరిచేరిన మనోసంబంధ శారీరక రుగ్మతలన్నీ నియంత్రితమవుతాయన్నది వైద్య శాస్త్రం ధృవీకరించిన అంశం.
నుదుట బొట్టు వలన ఆజ్ఞాచక్రం జాగృతమవుతుందనీ, దాని వల్ల మనిషి తనపై తాను నియంత్రణ పొంది పట్టు సాధించుకోగలుగుతాడనీ, ఎదుటి వారిని కూడా ఆకర్షించగలుగుతాడనీ యోగశాస్త్రం చెబుతోంది.